11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వొచ్చా? అంటే ఏఐ సమాధానం ఇదీ!

  • 11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వడంపై పెరుగుతున్న ఆందోళన
  • చాట్ జీపీటీని అడిగితే, ఐదు సంకేతాలు గమనించాలని సూచన
  • మూడింటికి పైగా నెగెటివ్ సంకేతాలు కనిపిస్తే ఇవ్వకపోవడమే మంచిదని సూచన
పదకొండేళ్ల ప్రాయంలో పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌‌లు ఇవ్వాలా వద్దా అనే అంశంపై తల్లిదండ్రులలో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. తోటి స్నేహితుల ఒత్తిడి, పాఠశాల గ్రూప్ చాట్స్ వంటి కారణాలతో పిల్లలు ఫోన్ల కోసం పట్టుబడుతుండగా, ఇది వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు, ఇటీవలి పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

కేవలం వయసును మాత్రమే కాకుండా, పిల్లల ప్రవర్తనా సంసిద్ధతను ప్రామాణికంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. "11 ఏళ్ల లోపు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వవచ్చా?" అని ఏఐ టూల్ 'చాట్‌జీపీటీ'ని బెంగళూరుకు చెందిన ఉద్యోగి ఒకరు  విశ్లేషించగా, పిల్లల్లో ఈ క్రింది ఐదు సంకేతాలను గమనించాలని అది సూచించింది.

1. మారాం చేయకుండా డివైజ్‌ను తిరిగి ఇచ్చేయడం
2. స్క్రీన్ అందుబాటులో లేకపోయినా సమయాన్ని ఉల్లాసంగా గడపగలగడం
3. స్నేహితుల ఒత్తిడికి తలొగ్గకుండా ఉండటం
4. తమ ఫోన్ వాడకం గురించి ఏ విషయాలూ దాచకుండా బహిరంగంగా చెప్పడం
5. సమయ పరిమితులను అంగీకరించడం... 
వీటిలో కనీసం మూడు అంశాల్లో ప్రతికూలతలు కనిపిస్తే, పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు పునరాలోచించుకోవాలని చాట్‌జీపీటీ పేర్కొంది.

ఈ అభిప్రాయాలకు ఇటీవలి పరిశోధనలు సైతం బలం చేకూరుస్తున్నాయి. 11 ఏళ్లలోపే వయసులోనే స్మార్ట్‌ఫోన్ వాడటం మొదలుపెట్టిన పిల్లల్లో డిప్రెషన్, ఊబకాయం, నిద్రలేమి వంటి సమస్యలు అధికంగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా బాలికలలో ఆత్మహత్య ఆలోచనలు, మానసిక అస్థిరత వంటి ఆందోళనకర ధోరణులు పెరుగుతున్నట్లు ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, పిల్లలకు నేరుగా స్మార్ట్‌ఫోన్ ఇచ్చే కంటే సమాచార మార్పిడి కోసం తొలుత బేసిక్ ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్‌లను అందించడం సురక్షితమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాత్రి వేళల్లో ఫోన్‌ను బెడ్‌రూమ్‌కు దూరంగా ఉంచడం, భోజన సమయంలో ఫోన్ వాడకాన్ని నిషేధించడం, వినోదం కోసం రోజుకు 60 నుంచి 90 నిమిషాలకు మించి అనుమతించకపోవడం వంటి కఠినమైన నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని వారు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

Smartphones for kids
Parenting tips
Child mental health
ChatGPT advice
Screen time limits

More Telugu News